Dussehra : దసరా అనగానే గుర్తుకొచ్చేది జమ్మిచెట్టు మరియు పాలపిట్ట దర్శనం. మరీ ముఖ్యంగా తెలంగాణ అయితే జమ్మి రాత మరియు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయం కనిపిస్తుంది.చెడు పై మంచి,సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు.ఈ పండుగ తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ దుర్గాదేవిని పూజిస్తారు.దీనిలో భాగంగా దసరా పండగ రోజు కచ్చితంగా పాలపిట్ట కనిపించాలని భావిస్తారు. అసలు పండుగ రోజు పాలపిట్ట ను చూడాలనే ఆచారం ఎందుకు వచ్చింది..? దాని వెనుక ఉన్న కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాలపిట్టను పరమేశ్వరుడి ప్రతిరూపంగా భావిస్తారు.
జన నివాసాలకు దూరంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పాలపిట్టలు కనిపిస్తాయి.నీలి , పసుపు రంగులో ఉండే ఈ పక్షిరూపం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.పండుగ రోజు ఈ పక్షిని చూడడం వలన ఏడాదంతా విజయాలు సాధిస్తారని నమ్మకం.ఇంకా పాలపిట్ట దర్శనం వెనుక పురాణగాధలు కూడా ఉన్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్లే సమయంలో ,విజయదశమి రోజున ఈ పాలపిట్ట ఎదురు వస్తుంది.ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి సీతమ్మను తీసుకువస్తాడు. తర్వాత అయోధ్య రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవుతాడు.

తద్వారా పాలపిట్టను విజయానికి సూచికగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మహాభారతం ఆధారంగా తీసుకుంటే.. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు జమ్మిచెట్టు మీద వారి యొక్క ఆయుధాలను భద్రపరుస్తారు. ఆయుధాలను సంరక్షించడం కోసం ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి.అలాగే అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి రాజ్యానికి వస్తున్న సమయంలో పాలపిట్ట దర్శనం పాండవులకు కలుగుతుంది.ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించి రాజ్యాన్ని తిరుగి పొందుతారు. కావున పాలపిట్ట ని విజయానికి ప్రతికగా భావిస్తారని పెద్దల మాట.ఇలా విజయదశమి పండగ రోజున పాలపిట్ట దర్శనం అనేది ఆనవాయితీగా వస్తుంది.