Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) కుర్రాళ్లతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన చివరిగా నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది.ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో సందడి చేసేందుకు సిద్దమయ్యాడు. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై బారీ అంచనాలు ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా రూపొందింది. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్న డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రామ్ చరణ్ కి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మూవీపై బాగా అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. “ఈ రోజున ప్రెస్ మీట్ ను పెట్టాలని కోరుకున్నవారిలో నేను ఒకడిని. ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్లందరికీ ఆ రోజున ప్రీ రిలీజ్ ఈవెంటులో కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆ రోజున అంతా కూడా రసాభాస అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ సందర్భాన్ని మొత్తం నా చేతుల్లోకి తీసుకుని, నా ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి కారకులు మీడియా మిత్రులే.

Chiranjeevi : ఆసక్తికర కామెంట్స్..
ఫంక్షన్ మొత్తం గందరగోళమై పోయింది .. ఏమీ జరగలేదంటూ నెగెటివ్ గా రాస్తారేమో .. వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో, మైక్ తీసుకుని మరో రకంగా ఆ సందర్భాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. నేను చాలా సింపుల్ గా ఉంటానని అందరూ అంటూ ఉంటారు. అలా ఉండటానికి కారణం నన్ను అలా మలచినవారే. ఇదంతా నా గొప్పతనమేనని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు” అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.