Mahesh Babu Mother : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వారి ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. అనుకోని ఈ సంఘటన కృష్ణ కుటుంబాన్ని షాక్ కి గురి చేయగా, ఇప్పటికీ ఆమె మృతిని కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్నయ్య రమేష్ బాబు అకాల మృతి చెందారు. కొన్నాళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రమేష్ బాబు చికిత్స పొందుతూ మరణించాడు. చిన్న వయస్సులోనే ఆయన అకాల మరణం చెందడం అందరిని కలిచి వేసింది.
ఈ రెండు సంఘటనలతో మహేష్ ఫ్యామిలీ తీవ్ర దుఃఖంలో ఉండగా, ఈ రోజు తెల్లవారుఝామున మహేష్ తల్లి, ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో బుధవారం ఉదయం ఆమె కన్నుమూశారు. సీనియర్ కథానాయకుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కాగా, వీరికి ముగ్గురు అమ్మాయిలు..పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని. ఇద్దరు కొడుకులు.. రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారు. మహేష్‌కి తల్లి అంటే చాలా ప్రేమ. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లిపై తెగ ప్రేమ కురిపిస్తుంటారు.

Mahesh Babu Mother : మాతృ వియోగం..
ఇక ఈరోజు ఉదయం ఇందిరా దేవి పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోలో కొంత సేపు ఉంచుతారు. తర్వాత మహా ప్రస్థానంలో అంత్య క్రియలను నిర్వహించనున్నారు. ఇందిరా దేవి మృతికి సామాన్యులు, సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా దేవి మృతి మహేష్ ఫ్యామిలీకి తీరని లోటు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. పలువురు స్టార్ హీరోలు మహేష్ కి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత రాజమౌళితో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.