Chiranjeevi : సాధారణంగా చిరంజీవి వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. తన వరకు వచ్చిన విషయాలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు. వ్యక్తిగతంగా ఎంతమంది విమర్శించినా వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటాడు మెగాస్టార్. కానీ ఆయన తమ్ముళ్లు మాత్రం అలా కాదు. మరీ ముఖ్యంగా నాగబాబు అన్నయ్యని ఎవరైనా పల్లెత్తి మాటంటే వెంటనే పంచులు ఇస్తాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా ఈయన చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎవరిని ఉద్దేశించి చేశాడు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావుని ఉద్దేశించి నాగబాబు ఈ కామెంట్స్ చేశాడని తెలుస్తోంది.
నాగ బాబు ఫైర్ : దీనికి అసలు రగడ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయి బలాయి కార్యక్రమంలో మొదలైంది. ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజు ఆలై బలై ఏర్పాటు చేయడం బండారి దత్తాత్రేయకు అలవాటు. దానికి సినీ రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరవుతారు. ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇంకా చాలామంది పాల్గొన్నారు. అందులోనే గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. ఆ కార్యక్రమానికి చిరంజీవి రాగానే చాలా మంది అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఆయన కూడా అందరితో ఓపికగా ఫోటోలు దిగుతూ స్టేజి పైకి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ఇదే సమయంలో స్టేజ్ మీద గరికపాటి ప్రసంగించడం మొదలుపెట్టాడు. కానీ చిరంజీవి ఎక్కడ ఫోటోలు దిగుతుండడంతో ఆసహనానికి లోనైన ఆయన.. చిరంజీవి వెంటనే స్టేజి మీదకి రాకపోతే తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాను అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ విషయం తెలిసి చిరంజీవి కూడా వెంటనే స్టేజి మీదకి వచ్చాడు.. గరికపాటికి క్షమాపణ కూడా చెప్పాడు. దీన్ని ఉద్దేశించి నాగబాబు వెంటనే ఒక ట్విట్ చేశాడు. ఏపాటి వారికైనా చిరంజీవి క్రేజ్ చూస్తే ఆ పాటి అసూయ కలగడం పరిపాటే అంటూ మెగా బ్రదర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ జరిగిన విషయాన్ని హైలెట్ చేస్తూ నాగబాబు సెటైర్లు వేశాడని కూడా అర్థమవుతుంది. మరి దీనిపై గరికపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.