YS Jagan Biopic : ఇప్పటి వరకు వెండి తెర మీద చాలామంది రాజకీయ నాయకుల బయోపిక్ ను ప్రదర్శించారు. చాలామంది రాజకీయ నాయకుల బయోపిక్ ను సినిమాగా తీశారు. చివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ ను కూడా సినిమాగా తీశారు. అందుకే ఆయన కొడుకు, ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్ ను కూడా తీసేందుకు రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు. నిజానికి సీఎం జగన్ ది స్ఫూర్తిదాయకమైన జీవితం. అందుకే ఆయన బయోపిక్ ను తీయాలనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. వైఎస్ జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘటనల ఆధారంగా బయోపిక్ ను తీయనున్నారట.
ఈ సినిమాను ఇప్పటికే వైఎస్సార్ బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా తీయనున్నారట. యాత్ర సినిమాను మహి రాఘవ తీశాడు. యాత్ర సీక్వెల్ కు కూడా మహీ రాఘవే దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో జగన్ పాత్రలో హీరో విశాల్ నటించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయట. ఏపీలో ఎన్నికలకు ముందే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపనలో ఉన్నారు వైఎస్ జగన్. అందుకే.. అన్ని విధాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోసం ఇప్పటి నుంచే ఎన్నికల కార్యాచరణను ప్రారంభించారు.

YS Jagan Biopic : ఏపీ ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యేలా ప్లాన్
ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా జగన్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే యాత్ర సీక్వెల్ ను తీసే అవకాశం ఉంది. ఈ సినిమాలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ఎలాంటి పథకాలను తీసుకొచ్చారో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. యాత్ర సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. జగన్ పాత్ర కోసం విశాల్ ను మూవీ యూనిట్ సంప్రదించిందట. దానికి విశాల్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఎన్నికల లోపు ఈ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో?