YCP : రాయలసీమలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులో నో డౌట్ కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ గెలుపు కష్టమే అన్నట్టుగా ఉంది. దానికి కారణం వైసీపీ స్థానిక నేతలే. ప్రస్తుతం హిందూపురంలోనూ అదే పరిస్థితి ఉంది. హిందూపురం వైసీపీ మాజీ ఇన్ చార్జ్ రామకృష్ణారెడ్డి హత్యకు గురయిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గమే రామకృష్ణారెడ్డిని హత్య చేయించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులే. దీంతో ప్రభుత్వం కూడా ఏం చేయాలో తెలియడం లేదు. ఆయన కుటుంబ సభ్యులే ఇలాంటి ఆరోపణలు చేస్తుండటంతో నిజనిజాలు తెలుసుకోవడం కోసం, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
అయితే.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిన తర్వాత కానీ.. సీఎం జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించలేదు. నిజానికి.. రామకృష్ణారెడ్డికి, ఆయన ప్రత్యర్థి వర్గానికి చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నాయి. ఈ విషయం వైసీపీ పార్టీలోని నేతలందరికీ తెలుసు. ఈ గొడవలు ఇలాగే ఉంటే పార్టీకే నష్టం కలుగుతుందని వైసీపీ నేతలు హైకమాండ్ కు చెప్పారు. గొడవలను సర్దుబాటు చేయాలన్నారు. కానీ.. స్థానిక నేతల మాటలను హైకమాండ్ సీరియస్ గా తీసుకోలేదు. మృతుడి కుటుంబ సభ్యులు.. ఎవరు హత్య చేయించారో డైరెక్ట్ గా చెబుతుండటంతో ప్రత్యర్థి పార్టీలు దాన్నే అవకాశంగా మలుచుకొని వైసీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

YCP : హిందూపురంలో టీడీపీని ఓడించాలన్నదే జగన్ ధ్యేయం
మరోవైపు హిందూపురంలో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో టీడీపీని ఓడించాలన్న కసితో వైసీపీ ఉంది. జగన్ ప్లాన్ కూడా అదే. మరోవైపు హిందూపురంలో వైసీపీని స్ట్రాంగ్ చేసేందుకు రామకృష్ణారెడ్డి చాలా కష్టపడ్డారు. కానీ.. ఆయన హత్య తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన్ను హత్య చేసిన వాళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం పార్టీ అగ్రనేతలు ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించలేదట. దీంతో స్థానిక ప్రజలు కూడా వైసీపీపై మండిపడుతున్నారు. అసలు.. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇంతలా రోడ్డు మీదికి వచ్చి కొట్టుకోవడమే కాదు.. హత్యలు చేసే స్థాయికి ఎదిగారంటే అసలు పార్టీలో ఏం జరుగుతోందో నాయకుడికి తెలియదా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు హిందూపురంలో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న జగన్ ఇటువంటి విషయాలను పట్టించుకోకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.