Love Marriage : జనరేషన్ మారింది. ఒకప్పుడు లవ్ మ్యారేజ్ అంటేనే తెలియదు. కానీ.. ఇప్పుడు చూడండి.. ఎక్కడ చూసినా లవ్ మ్యారేజే. ఈ కాలం యువతీయువకులు అస్సలు పేరెంట్స్ కుదిర్చిన వివాహాలను చేసుకోవడం లేదు. ప్రేమ వివాహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరెంట్స్ కాదంటే చివరకు వాళ్లను ఎదిరించి అయినా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలామంది యువత ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. అలా ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటకు విచిత్రమైన, ఊహించని శిక్ష వేశారు గ్రామ పెద్దలు.
ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం పాతవీరాపురంలో చోటు చేసుకుంది. లీలావతి అనే యువతి.. కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించింది. చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లు.. ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ.. ఏడు నెలల కిందనే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. పెళ్లయినప్పటి నుంచి లీలావతి తన అత్త ఊరిలోనే ఉంది. పెళ్లి అయిన ఏడు నెలల తర్వాత తన తల్లిగారింటికి భర్తతో పాటు వచ్చింది లీలావతి.

Love Marriage : గ్రామ కట్టుబాట్లను కాలరాశారని రూ.50 వేలు జరిమానా
పెళ్లయిన తర్వాత తొలిసారి ఊరికి వచ్చిన లీలావతి, తన భర్తను గమనించిన ఊరి పెద్దలు.. వెంటనే పంచాయితీ పెట్టించారు. లీలావతి తల్లిదండ్రులను పిలిపించి.. ఊరు కట్టుబాట్లను తుంగలో తొక్కారని ప్రేమ వివాహం చేసుకుందని, అందుకని రూ.50 వేలు కట్టాలని, జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చేసేదేం లేక.. డబ్బులు కట్టడానికి తమకు మరికొంత సమయం కావాలని లీలావతి తల్లిదండ్రులు గ్రామ పెద్దలను కోరారు. అయితే.. వాళ్లకు ఇచ్చిన సమయం ముగిసినా కూడా డబ్బులు కట్టకపోవడంతో గ్రామ పెద్దలు లీలావతిపై దాడికి ప్రయత్నించారు. దీంతో లీలావతికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే లీలావతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు లీలావతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది.