YS Jagan : ఏ రాష్ట్రంలో అయినా ఒక్కటే రాజధాని ఉంది. కానీ.. ఏపీలో మాత్రం మూడు రాజధానులు. అది కూడా పేపర్లకే పరిమితం అయింది. ఇప్పటి వరకు ఒక్క రాజధానికి కూడా ఏపీలో దిక్కులేదు. పేరుకు మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది కానీ.. ఇప్పటి వరకు మూడు రాజధానుల అంశంపై పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మధ్యలో కోర్టు కేసులు, నిరసనలు లాంటివి వ్యక్తం అవడంతో మూడు రాజధానుల అంశం కూడా అటకెక్కింది. అయితే.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ వైజాగ్ లో పరిపాలన(అడ్మినిస్ట్రేషన్)ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ముందుగా వైజాగ్ లో పరిపాలనను ప్రారంభిస్తామని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో వచ్చే నెలలోనే వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్… త్వరలోనే విశాఖలో పరిపాలనను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఎలాగైనా మూడు రాజధానుల అమలుపై జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. దానిపై ఆయన ఇటీవలే క్లారిటీ కూడా ఇచ్చేశారు. అధికార వికేంద్రీకరణే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర రాజధాని విషయంలో అయినా గ్రామ పరిపాలన విషయంలో అయినా తమ విధానం ఇదే అని ఆయన స్పష్టం చేశారు.

YS Jagan : ఉభయ సభల్లోనూ జగన్ కు బలం ఎక్కువే
మూడు రాజధానుల బిల్లును శాసన సభ, శాసన మండలి రెండు సభల్లో నెగ్గించుకునే బలం ప్రస్తుతం వైసీపీకి ఉంది. కానీ.. న్యాయపరమైన చిక్కులే వైఎస్ జగన్ ను టెన్షన్ పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల లోపు మూడు రాజధానుల అంశం పూర్తవ్వాలి. లేకపోతే వైసీపీకి తీరని నష్టం చేకూరుతుంది. వైజాగ్ లో పరిపాలన రాజధాని తీసుకురావచ్చు.. అమరావతిలో శాసన రాజధాని ఎలాగూ ఉంది. కానీ.. కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకురావడమే జగన్ కు చాలెంజింగ్ టాస్క్. దానికి కారణం. హైకోర్టు న్యాయమూర్తులు అందరూ న్యాయ రాజధానికి మద్దతు తెలపాలి. అప్పుడే న్యాయ రాజధాని కర్నూలుకు తరలుతుంది. దీనికి కేంద్ర సాయం కూడా కావాలి. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లోపు మూడు రాజధానులపై సీఎం జగన్ ఎలాంటి ఆలోచన చేస్తారో?