JD Lakshmi Narayana : జేడీ లక్ష్మీనారాయణ తెలుసు కదా. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత తన ఉద్యోగానికే వాలంటీర్ గా రాజీనామా చేసి ఆ తర్వాత తన జీవితం ప్రజా సేవకే అంకితం అని చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు. జనసేన పార్టీలో చేరి గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆయన బాగానే ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. వైసీపీ గాలిలోనూ ఆయనకు 3.5 లక్షల ఓట్లు వచ్చాయి. అయితే.. అక్కడ త్రిముఖ పోటీ ఉండటంతో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జనసేన పార్టీకి కూడా రాజీనామా చేశారు.
అయితే.. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లారన్న కోపంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తన సొంతూరుకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజా సేవ చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారట. మరోసారి అంటే వచ్చే ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా మళ్లీ బరిలోకి దిగాలని లక్ష్మీనారాయణ యోచిస్తున్నారట. కాకపోతే ఏ పార్టీ తరుపున చేయాలి.. లేదా స్వతంత్రంగా చేయాలా అనేదానిపై ఇంకా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

JD Lakshmi Narayana : స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా?
ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు బలంగా ఉన్నారు. ఆ తర్వాత జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? అంటే కష్టం అనే చెప్పుకోవాలి. ఆ విషయం ఆయనకు కూడా తెలిసింది కాబట్టే.. ఏదో ఒక పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నారట. అయితే.. వైసీపీలో ఆయన అస్సలు చేరరు అనే విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీలోనూ చేరరు. ఇక ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన. అప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్న సమయంలో మళ్లీ తిరిగి పార్టీలో చేరడానికి ఆయన మొహమాట పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ.. జనసేన పార్టీ అధినాయకత్వం నుంచి, లేదా పవన్ కళ్యాణ్ నుంచి నేరుగా ఆహ్వానం అందితే వెంటనే పార్టీలో చేరడానికి జేడీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ జేడీ తిరిగి జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేస్తే ఈ సారి ఖచ్చితంగా గెలుస్తారు అని రాజకీయవేత్తలు కూడా అంటున్నారు. చూద్దాం మరి.. జనసేన పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందుతుందో లేదో?