Amaravathi : ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని గురించే చర్చ. ఓవైపు ఒకే రాజధాని అనడం, మరోవైపు మూడు రాజధానులు అనడం.. ఇదే రాజకీయంగా మారింది. అమరావతి రాజధానిగా ఓకే అయిపోతే విపక్షాలు గెలిచినట్టు, లేదంటే.. వైసీపీ గెలిచినట్టు.. అనే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈలోపు అమరావతి రాజధాని అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేలా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని టీడీపీ భావిస్తుంటే.. ఎలాగైనా ఎన్నికల లోపు మూడు రాజధానుల అంశాన్ని కొలిక్కి తేవాలని జగన్ సర్కారు భావిస్తోంది. అయితే..
ఇప్పుడిప్పుడే వైసీపీ పవర్ పాలిటిక్స్ కు పదును పెట్టింది. వచ్చే ఎన్నికల వరకు అమరావతి అజెండానే ముందుకు తీసుకెళ్లి ప్రతిపక్షాలకు సవాల్ విసిరేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అందుకే ఇప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరుగా సాగుతోంది. అమరావతి రైతులు ఏపీ మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. విపక్షాలన్నీ అమరావతి రైతులకు మద్దతు ఇస్తోంది. మూడు రాజధానుల అంశంపై వైసీపీ అడుగులు వేస్తోంది. అందుకే ముందు వైజాగ్ ను కేంద్ర బిందువుగా మార్చుతోంది. వైజాగ్ లో ముందు పరిపాలన రాజధానిని ప్రకటిస్తే కొంతవరకైనా రాజధాని సమస్య తీరుతుందని జగన్ సర్కారు భావిస్తోంది.

Amaravathi : అమరావతి ఉద్యమం ఊపు ఎన్నికల దాకా ఉంటుందా?
విపక్షాలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయి కానీ.. మూడు రాజధానులను నూటిని నూరు శాతం విపక్షాలు ఎదుర్కోలేకపోతున్నాయి. వైసీపీ సర్కారును మూడు రాజధానుల అంశంపై ఇరుకున పెట్టలేకపోతున్నాయి. దానికి కారణం 2019 ఎన్నికల తర్వాత విపక్షాలు గెలిచిన సీట్లు. వాళ్లకు ఉన్న ప్రజాప్రతినిధులు. టీడీపీకి ప్రస్తుతం ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలే. కానీ.. వైసీపీకి ఉన్నది 151 మంది. జనసేనకు ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా లేదు. బీజేపీ పరిస్థితి తెలిసిందే కదా. అందుకే ఏపీలో విపక్షాలకు అంతగా పట్టు లేకుండా అయిపోయింది. ఇప్పటి వరకు అమరావతి ఉద్యమాన్ని విపక్షాలు మోసుకుంటూ వచ్చాయి. కానీ.. మరో రెండేళ్ల పాటు విపక్షాలు అమరావతి ఉద్యమాన్ని మోయగలుగుతాయా? అనేదే పెద్ద ప్రశ్న. అమరావతి రాజధానే ముద్దు అని అన్ని ప్రాంతాల ప్రజలను విపక్షాలు ఒప్పించగలుగుతాయా? వైజాగ్ లో పరిపాలన రాజధాని వద్దని అమరావతే ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలను ఒప్పించగలరా? ఇవన్నీ జరిగితేనే విపక్షాలు సక్సెస్ అయినట్టు. లేకపోతే అమరావతి ఉద్యమం మధ్యలోనే నీరుగారిపోయే అవకాశం ఉంది.