Telangana : ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉండాలి. ఎందుకంటే.. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వ పార్టీ వేరే ఉంటుంది.. గవర్నర్ కేంద్రం నుంచి వచ్చే వాళ్లు అయి ఉంటారు. ఈనేపథ్యంలో ఒక్కోసారి పార్టీలు వేరవడం వల్ల ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య చెడుతుంది. అదే చాలా సమస్యలకు దారి తీస్తుంది. ప్రస్తుతం తెలంగాణలోనూ అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మళ్లీ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది.

నిజానికి.. ఈ వార్ ఇప్పుడు మొదలైంది కాదు. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు గవర్నర్ మధ్య విభేదాలు పుట్టుకొచ్చాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డిని సేవా విభాగం కింద ఎమ్మెల్సీగా తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసినా.. ఆ ఫైల్ ను గవర్నర్ కు పంపితే అక్కడ ఆమె పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ కేబినేట్ ఆమోదించి.. గవర్నర్ కు పంపితే పెండింగ్ లో పెట్టడం ఏంటంటూ.. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో గవర్నర్, సీఎం కేసీఆర్ కలిసినప్పుడు ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నట్టు అనిపించినా మళ్లీ వాళ్ల మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది.
Telangana : మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తమిళిసై
అయితే.. తాజాగా మరోసారి తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మళ్లీ వీళ్ల మధ్య వార్ మొదలైనట్టే అని తెలుస్తోంది. ఇదివరకు విమర్శలు చేసినట్టే ఇప్పుడు కూడా మళ్లీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీలో తెగ చర్చ నడుస్తోంది. ప్రభుత్వాన్ని నేరుగానే గవర్నర్ విమర్శిస్తుండటంపై ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రజా దర్బార్ పేరుతో రాజ్ భవన్ లోనే డైరెక్ట్ గా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో ఇంకా ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజానికి.. ప్రభుత్వమే గవర్నర్ కు సహకరించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. తాను కలిసిపోవడానికి రెడీగానే ఉన్నానని.. ప్రభుత్వమే తాను ఎంత కలిసి పోవాలనుకున్నా సహకరించడం లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. కనీసం ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి పంపించే రిపోర్టులపై ప్రభుత్వం స్పందించడం లేదని, అధికారులు కూడా కనీసం తనకు సహకరించడం లేదని.. అందుకే తన పని తాను చేసుకుపోతున్నానని.. ఎవ్వరికీ భయపడనని గవర్నర్ స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.