Ind vs Aus: బుమ్రా స్థానంలో టీమిండియా తరపున ఆడేందుకు జట్టులో చేరిన షమీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్ము రేపాడు. నిన్న ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో షమీ బౌలింగ్ మాయాజాలంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. మ్యాచ్ దాదాపు ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లగా, షమీ చేసిన మ్యాజిక్‌తో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధిచింది. ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్క ఓవర్లో 11 పరుగులు చేస్తేనే ఆసీస్ గెలుస్తుంది. ఇక గెలుపు లాంచనమే అని అనుకున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ చేతికి బంతిని అందించాడు. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ టీ20ల్లో ఆడని షమీతో డెత్ ఓవర్ బౌలింగ్ చేయించడం అనేది అతడికి ఓరకంగా అగ్నిపరీక్షే. ఇటీవలి కాలంలో భారత బౌలర్ల డెత్ ఓవర్ బౌలింగ్ చూశాక ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. కానీ షమీ అద్భుతం చేశాడు. తొలి 2 బంతులకు 4 పరుగులు ఇచ్చిన షమీ.. తర్వాతి బంతికి కమిన్స్‌ను ఔట్ చేశాడు. ఈ వికెట్ దక్కడంలో క్రెడిట్ అద్భుతమైన క్యాచ్ అందుకున్న కోహ్లికే ఎక్కువగా దక్కుతుంది. నాలుగో బంతికి అగర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో బంతికి జోష్ ఇంగ్లిస్ బౌల్డ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఆరో బంతికి రిచర్డ్సన్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

Ind vs Aus : అదరగొట్టాడు..
దీంతో.. ఆసీస్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి షమీ తనేంటో నిరూపించుకున్నాడు. గాయం కారణంగా వరల్డ్ కప్‌కు దూరమైన టీమిండియా పేసర్ బుమ్రాకు ప్రత్యామ్నయంగా ఎవరిని భర్తీ చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో షమీ ఈరేంజ్‌లో అదరగొట్టడం టీమిండియా ఆశలకు ఊపిరిపోసింది. కొద్ది వారాల క్రితం కోవిడ్ బారిన పడిన షమీ.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. తర్వాత ఎన్సీఏ చేరి శ్రమించాడు. కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మ్యాచ్ చివరి ఓవర్లో బౌలింగ్ చేసి సత్తా చాటాడు. షమీని పరీక్షించడం కోసమే అతడికి ఆఖరి ఓవర్లో బంతిని ఇచ్చామని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు.